Friday 15 September 2023

Bathukamma song - written by me

 రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో

రామ రామానంది రాగమెత్తా రాదు

హరిహరియ ఓ రామ హరియ బ్రహ్మ దేవ

హరియన్న వారికి ఆపదలు రావు

శరణన్న వారికి మరణంబు లేదు

ముందుగా నిను తల్తు    ముత్యాల పోషమ్మ

తర్వాత నిను తల్తు     తల్లిరో పెద్దమ్మ

ఆదిలో నిను తల్తు     అయిలోని మల్లన్న

కోరుతా నిను తల్తు     కొంరెల్లి మల్లన్న

మారునా నిను తల్తు     మావురాలెల్లమ్మ

బోగాన నిను తల్తు     బొంతపల్లీరన్న

శరణన్న వరంగల్లు     శంభుడా నినుతల్తు

భద్రంగ చూడమ్మ    భద్రకాళీ తల్లీ


రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో

రామ రామానంది రాగమెత్తా రాదు


పొద్దున్నే భూదేవి    మొక్కుదునే నిన్ను

బాధల్ల నిను తల్తు    భద్రాద్రి రామన్న

గుండెల్లో నిను తల్తు    కొండగట్టంజన్న

ఎప్పుడూ నినుతల్తు    ఎములాడ రాజన్న

యాదిలో నినుతల్తు    యాదగిరి నర్సన్న

చింతల్లో నినుతల్తు    సమ్మక్కసారక్క

కీర్తిగా నినుతల్తు   కీసరా రామన్న

రామ రామ రామ కోదండ రామ

రామ రామ రామ భద్రాద్రి రామ

రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో

రామ రామానంది రాగమెత్తా రాదు

చల్లగా నను జూడు    చాముండీ మాత

ఉడిపిలో కూసున్నడుయ్యాలో చిన్ని కృష్ణుడమ్మ

శృంగేరి శారదాంబ హంపి విఠలుడమ్మ

మురుడేశ్వరా మమ్ము   దీవించు ఓదేవా

గోకర్ణ ఈశ్వరా  బేలూరు చెన్నయ్య

కోటిలింగేశ్వరా కాపాడి మమ్మేలు

హంపి విరూపాక్ష కరుణించి కాపాడు

మూకాంబికా మాత  మా ముద్దులా తల్లి

అందరినీ తలిశి    గంగా నిను మరిసి

గంగ నిను తల్వంది    గడియ నిలువాలేము

మోతుకూ చెట్టు కింద    పుట్టినావే గంగ

మొలమంటి కాల్వలు    పారినావే గంగ

తంగేడు చెట్టు కింద     పుట్టినావే గంగ

తల్లేడు కాల్వలు    పారినావే గంగ

జిల్లేడు చెట్టు కింద    జిల జిల కాల్వలు

ఊరుమూ చెట్టు కింద    పుట్టినావే గంగ

ఉరిమి ఉరిమి కాల్వలు    పారినావే గంగ

కట్టినావు గంగ    పట్టంచు చీరలు

తొడిగినావు గంగ     ముత్యాల రవికెలు

పూసినావు గంగ    పుట్టెడు బంగారు

పెట్టినావు గంగ    గవ్వల మండ్రాలు

గంగ నువ్వు లేక    గడియ నిల్వ లేము

గంగ నీకు శరణు    తల్లి నీకు శరణు

కాపాడి మమ్మేలు    కైలాస రాణి

ఓరుగల్లొదినెమ్మలు   సిద్దిపేట సిన్నమ్మలు

పాలమూరు పెద్దమ్మలు   మెతుకుసీమ మేనత్తలుయ్యాలో

 హైదరబాదక్కలు  కోరుట్ల కాంతలూ  

తల్లిగారింటికీ   దూరంగా ఉన్నారు

రందీ పడకూ శెల్లె  బాధ పడకూ అక్క

బెంగ్లూరుకొచ్చింది బంగారు బతుకమ్మ

ఉశ్కెల పుట్టిన గౌరి   ఊరూరు తిరిగింది 

పసుపుల పుట్టిన గౌరి పల్లెలన్నీ తిరిగె

తెలంగాణల పుట్టి   బెంగ్లూరుకొచ్చింది

గుమ్మాడి ఆకులను, సిబ్బి మీద పేర్చి 

తంగేడు పూలతో బతుకమ్మలే పేర్చి

సీతజడ పూలతో, దండలే అల్లేరు

బంతిచేమంతులతో  బాగుగా అర్చించి

తీరొక్క పూలతో తల్లినీ పూజించి

పచ్చిపసుపుతోటి గౌరమ్మనే జేశి

కోలాటాలే ఆడి పాటలెన్నో పాడి

సత్తెక్క తెచ్చిన   సత్తు పిండీ సద్ది 

విమలమ్మ తెచ్చినా అటుకుల బెల్లమూ 

మాలిని తెచ్చిన మలియా ముద్దలు 

సరళమ్మ తెచ్చిన బియ్యపు గారెలు

యాదమ్మ తెచ్చిన పులిహోర అన్నమూ

అన్ని సద్దులు పంచి పసుపుకుంకుమలిచ్చి

పోయిరా బతుకమ్మ మళ్లీ రావమ్మ

No comments:

Post a Comment