Monday, 4 August 2025

 నాకు నిన్ననే తెలిసిన ఒక విషయం మీ అందరితో చెప్పాలనుకుంటున్నాను. 

కర్ణాటకలో వినాయక చవితిని గౌరీగణేశ హబ్బ అంటారు. అంటే గౌరీగణేశ పండుగ. ముందు రోజు గౌరీ పూజ చేసి తర్వాతి రోజు వినాయక చవితి చేస్తారు. మనం వినాయక చవితి మాత్రమే చేస్తాము. ముందు రోజు గౌరీ దేవిని ఆరాధించడం మన దగ్గర లేదు. కర్ణాటకలో ఇలా గౌరీ మరియు గణేశ ఎందుకు చేస్తారు అని అడిగినప్పుడు నాకు నా ఫ్రెండ్స్ చెప్ని సమాధానం ఏమిటంటే...

గౌరీ దేవి వరలక్ష్మీ వ్రతం కోసం తన పుట్టింటికి వచ్చింది. తన పుట్టిల్లు అంటే ఏమిటి, తను పర్వత రాజు కూతురు కదా... హిమగిరి తనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీ లలితే. అంటే పార్వతీ దేవి భూలోకానికి వచ్చిందన్నమాట. పండుగ అయిపోయిన తర్వాత రోజులు గడుస్తున్నా కూడా తను ఇంకా మెట్టినింటికి శివుని దగ్గరకు వెళ్లలేదు. పుట్టింటి ప్రేమ మరి. పార్వతమ్మను తీసుకురమ్మని శివుడు వినాయకుని భూలోకానికి పంపుతాడుట. మీ అమ్మను తీసుకురా పో అని. అలా గణేశుడు భూలోకానికి వస్తాడు. అదే గణేశ చతుర్థి లేదా మన వినాయక చవితి. ఇక వినాయకుడు కూడా 9 రోజుల పాటు ఇక్కడే తిష్ట వేస్తాడట. మరి మన ఉండ్రాళ్ల మహిమ అది.. ఇక లాభం లేదని శివుడు వీళ్లిద్దరినీ తీసుకురమ్మని గంగమ్మ తల్లిని భూలోకానికి పంపుతాడట. అదేనండీ వర్షాలు. అందుకే వినాయక నవరాత్రులలో ఒక్కరోజైనా ఖచ్చితంగా వర్షం పడుతుంది.

ఇలా భగవంతుడిని మనలో ఒకరిగా, భగవంతునితో మనం నిత్యం మాట్లాడుతున్నట్టుగా, దేవుడిని మన నిత్య జీవితంలో ఒక భాగంగా భావించడమే భక్తి అంటే.

No comments:

Post a Comment