Monday, 26 August 2019

శ్రీరాముని తల్లి ఉయ్యాలో
శ్రీమతి కౌసల్య ఉయ్యాలో


ప్రేమతో శాంతనూ ఉయ్యాలో
పిలిచి దగ్గర తీసే ఉయ్యాలో


చల్లని మాటలు ఉయ్యాలో
సతి ధర్మములు కొన్ని ఉయ్యాలో


చెప్పెనూ ఈ రీతి ఉయ్యాలో
చెవులకూ ఇంపుగా ఉయ్యాలో

మా తల్లి శాంతమ్మా ఉయ్యాలో
మా ముద్దులా పట్టి ఉయ్యాలో

అత్తవారింటికీ ఉయ్యాలో
ఆనందముగ పొమ్ము ఉయ్యాలో


అత్తమామల సేవ ఉయ్యాలో
చిత్తంబులో నిలిపి ఉయ్యాలో

భర్త దైవంబని ఉయ్యాలో
భావించి పూజించు ఉయ్యాలో

వారినీ పూజింప ఉయ్యాలో
వైకుంఠ మబ్బును ఉయ్యాలో

వారిపై నీ ప్రేమ ఉయ్యాలో
వాసుదేవుని పూజ ఉయ్యాలో

పేదరికమును జూచి ఉయ్యాలో
ప్రీతి దప్పకు తల్లి ఉయ్యాలో

కలిగి యున్నంతలో ఉయ్యాలో
కనిపెట్టి ఉండాలే ఉయ్యాలో


ఇరుగుపొరుగిండిలకు ఉయ్యాలో
తిరుగబోవద్దమ్మ ఉయ్యాలో

అందు వలన నీకు ఉయ్యాలో
అపకీర్తి వచ్చును ఉయ్యాలో

అప కీర్తి కంటెనూ ఉయ్యాలో
అతివ చావు మేలు ఉయ్యాలో

పడతి చక్క దనము ఉయ్యాలో
బయట పెట్ట రాదు ఉయ్యాలో

తన చక్కదనమునూ ఉయ్యాలో
దాసుకొని తిరగాలి ఉయ్యాలో

పలికి బొంక రాదు ఉయ్యాలో
ప్రాణాలు బోయినా ఉయ్యాలో

సత్యమును ఎప్పుడూ ఉయ్యాలో
నేర్పుతో పలకాలి ఉయ్యాలో

సాధుసత్పురుషులు ఉయ్యాలో
సమయానికేతెంచు ఉయ్యాలో

అన్నపాణాదులు ఉయ్యాలో
ఆదరించుు తల్లి ఉయ్యాలో

ఏది చేసిన గానీ ఉయ్యాలో
ఏది చూసిన గానీ ఉయ్యాలో

వెనక ముందనక ఉయ్యాలో
వేగిరా పడవద్దు ఉయ్యాలో

మాట మన్నన లేక ఉయ్యాలో
మంచి పేరు రాదు ఉయ్యాలో


మాట జారిన వెనుక ఉయ్యాలో
మళ్ళి తిరిగి రాదు ఉయ్యాలో

అందుకే ముందుగా ఉయ్యాలో
ఆలోచన ఉండాలి ఉయ్యాలో

మంచి కీర్తి బతుకు ఉయ్యాలో
కొంచెమైనా చాలు ఉయ్యాలో



కొడుకులు బిడ్డలు ఉయ్యాలో
కొమరొప్ప కలగని ఉయ్యాలో


నిండు ముత్తైదవై ఉయ్యాలో
యుండవే మాతల్లి ఉయ్యాలో


పోయిరా శాంతమ్మ ఉయ్యాలో
పోయిరా మా తల్లి ఉయ్యాలో


పోయి మీ అత్తింట్ల ఉయ్యాలో
బుద్ధి గలిగి ఉండు ఉయ్యాలో

No comments:

Post a Comment