Sunday, 25 August 2019

అనగనగ రాజ్యాన, ముని దంపతులిద్దరూ
పిల్లలూ లేరని, రంది పండుతుండిరీ
నోములన్నీ నోమిరుయ్యాలో, పూజలన్నీ జేసి రుయ్యాలో
పూజల ఫలమునా, కొడుకు రత్నం పుట్టె
శ్రవణ కుమారుడూ, పెరిగి పెద్దగాయె
లేక లేక పుట్టె, అల్లారు ముద్దాయే
విలువిద్యలన్నియూ , విరివిగా నేర్పించి
మంచి మాటలు జెప్పి, మక్కువతో పెంచిరీ
ముసలి దంపతులిద్దరుయ్యాలో, ముదముతో ముద్దాడె
కాళ్ళు కదలయాయె, కంటి చూపు పాయె
కన్న కొడుకే వారి, కంటి చూపు ఆయె
కాశి యాత్రలకనీ, బయలు దేరినారు
ముసలి తల్లిదండ్రులను, కావడీ కట్టుకొని
బయలుదేరే శ్రవణుడు, కాశీ యాత్రలకు
కోసలాధీశుండు ఉయ్యాలో దశరథ నాముండు ఉయ్యాలో
రఘువంశ రాజు ఉయ్యాలో- శబ్దబేదిల దిట్ట ఉయ్యాలో
కొండ కోనలు దాటి ఉయ్యాలో వేటకే బోయెను ఉయ్యాలో
అడవిలో దిరిగెను ఉయ్యాలో అటు ఇటు జూచెను ఉయ్యాలో
చెట్టు గుబురుల చాటు ఉయ్యాలో చెరువొకటి కనిపించె ఉయ్యాలో
శబ్దమేదొ వినెను ఉయ్యాలో శరమును సంధించె ఉయ్యాలో
జంతువేదొ జచ్చె ఉయ్యాలో అనుకొని సాగెను ఉయ్యాలో
చెంతకు చేరగా ఉయ్యాలో చిత్తమే కుంగెను ఉయ్యాలో
కుండలో నీళ్ళను ఉయ్యాలో కొనిపో వచ్చిన ఉయ్యాలో
బాలుని గుండెలో ఉయ్యాలో బాణమే గ్రుచ్చెను ఉయ్యాలో
ఎవ్వరు నువ్వనె ఉయ్యాలో ఏడ్పుతో దశరథుడు ఉయ్యాలో
శ్రవణుడు నేననె ఉయ్యాలో చచ్చేటి బాలుడు ఉయ్యాలో
తప్పు జరిగెనంచు ఉయ్యాలో తపియించెను రాజు ఉయ్యాలో
చావు బతుకుల బాలుడుయ్యాలో సాయమే కోరెను ఉయ్యాలో
నా తల్లిదండ్రులు ఉయ్యాలో దాహంతో ఉండిరి ఉయ్యాలో
ఈ నీళ్ళు గొంపోయి ఉయ్యాలో ఇచ్చి రమ్మనెను ఉయ్యాలో
ఆ నీళ్ళతో రాజు ఉయ్యాలో అడవంతా వెదికె ఉయ్యాలో
ఒకచోట జూచెను ఉయ్యాలో ఒణికేటి దంపతుల ఉయ్యాలో
కళ్ళైన లేవాయె ఉయ్యాలో కాళ్ళైన కదలవు ఉయ్యాలో
వృద్ధ దంపతుల జేరి ఉయ్యాలో వేదన చెందుతూ ఉయ్యాలో
సాష్టాంగ పడె రాజు ఉయ్యాలో సంగతి జెప్పెను ఉయ్యాలో
పలుకు విన్నంతనే ఉయ్యాలో పాపమా వృద్ధులు ఉయ్యాలో
పుత్ర శోకంతోని ఉయ్యాలో - పుట్టెడూ దుఃఖంతో ఉయ్యాలో
పుత్ర శోకమే నీవు ఉయ్యాలో - అనుభవించెదవనీ ఉయ్యాలో
శాపాలు బెట్టిరి ఉయ్యాలో చాలించిరి తనువులుయ్యాలో
శాపమే ఫలియించె ఉయ్యాలో జరిగె రామాయణం ఊయ్యాలో
లోక కల్యాణమాయె ఉయ్యాలో లోకమే మెచ్చెను ఉయ్యాలో

No comments:

Post a Comment